సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉభయ తెలుగు రాష్ట్రాలలో నేటి మంగళవారంతో దాదాపుగా గణేష్ పందిళ్ళలో వేడుకలు ముగిస్తున్నాయి. కులమతాలకు అతీతంగా యువత కోలాహలం మధ్య నిమజ్జనాల సందడి.. లడ్డుల వేలం పాటలు, అన్నసమారాధనలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే అందరి ద్రుష్టి ఆ మహా గణనాధునిపైనే.. ఆ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ఘనంగా ముగిసింది. మరల వచ్చే ఏడాది మరింత వైభవంగా గణేష్ వేడుకలు నిర్వహించే సామర్థ్యం ఇవ్వమని ఆ గణేష్ మహారాజు ను వేడుకొంటూ.. భారీగా తరలివచ్చిన భక్తుల జయజయ ధ్వానాల మధ్య ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేశారు. ఉదయం 6గంటల నుంచి మహాగణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది. శోభాయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జై బోలో గణేశ్ మహరాజ్ కు జై.. గణపతి బప్పా మోరియా.. జైజై గణేశా అనే నినాదాలతో శోభయాత్ర సాగే ప్రాంతాలు మారుమోగిపోయాయి. హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనోత్సవం కన్నుల పండువగా సాగుతుంది. నగరంలోని గణనాథులు నిమజ్జనోత్సవానికి ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నాయి. అన్ని మార్గాలు ఇసుకేస్తే రాలనంత రీతిలో జనంతో కిక్కిరిసిపోయాయి. గణనాథుల నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
