సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి తాపంతో అట్టుడికిపోతున్న ప్రజలను కనికరిస్తూ గత మధ్యాహ్నం 3 గంటల నుండి పశ్చిమగోదావరి వ్యాప్తంగా సాయంత్రం 7 గంటల వరకుఉరుములు పిడుగులతో కురిసిన భారీ వర్షానికి జిల్లాలో చాల ప్రాంతాలలో గాలుల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిపివేశారు.అరటి తోటలు కొంతమేర నష్టపోయాయి. భీమవరం పట్టణానికి 7 కిలో మీటర్లు దూరంలో శృంగవృక్షానికి చెందిన రైతు నిమ్మన శ్రీనివాస్(45) చెట్టు విరిగిపడి మృతి చెందినట్లు సమాచారం. ఆ రైతు ఆర బెట్టిన ధాన్యం తడుస్తుందన్న కంగారులో ఇంటి వద్ద నుంచి పొలం కు బైక్ ఫై బయలుదేరాడు. దారిలో కొబ్బరిచెట్టు విరిగిపడి శ్రీనివాస్ మృతి చెందాడు. మరోవైపు అకాల వర్షానికి రైతుల్లో ఆందోళన మొదలయింది. మరో 2 రోజులు పాటు ఈ తరహా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జిల్లాలో కోతకోసిన వరి పంట ధాన్యాన్ని ఆరబెట్టిన ధాన్యాన్ని రాశులుగాను, బస్తాలుగా మార్చేందుకు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో రెండు లక్షల 20 వేల ఎకరాలలో దాళ్వా సాగు చేయగా ఇప్పటి వరకు లక్షా 70 వేల ఎకరాలలో పంట కోత పూర్తీ అయ్యిందని అంచనా. నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించగా, 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాశులుగా, బస్తాలుగా ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా. అయితే ఈ వర్షాలతో పెద్దగా నష్టం ఉండదని భావిస్తున్నారు.
