సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గoలో అత్యధికంగా జనసేనపార్టీ సభ్యత్వాలు నమోదు అయ్యేలా జనసైనికులు, వీర మహిళలు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు( అంజిబాబు) జనసేన క్యాడర్ కు నేడు, గురువారం పిలుపు నిచ్చారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన జరిగిన పార్టీ మెంబర్షిప్ వాలంటీర్స్ సమావేశంలో అంజిబాబు మాట్లాడుతూ.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి , పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ ఐదు సంవత్సరాల పాలనలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నూరు శాతం రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికి మంచినీటి కుళాయి అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. పార్టీ కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా నేరుగా తన వద్దకు వస్తే సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. జనసేన పార్టీలో 500 రూపాయలు చెల్లించి క్రియాశీలక సభ్యులుగా చేరితే 5 లక్షల రూపాయల ప్రమాద భీమా వర్తిస్తుందని చెప్పారు. గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు చినబాబు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గంలో 15 వేల సభ్యత్వాలు నమోదు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం లో స్థానిక నేతలు జనసైనికులు, వీర మహిళలు, సభ్యత్వ నమోదు వాలంటీర్లు పాల్గొన్నారు.
