సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆశ్చర్యకర సంఘటన ఒకటి చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆధునిక పద్ధతులు విఫలమైన చోట ఒక మూగజీవి జియాలజిస్ట్ గా మారింది. ఇప్పటివరకు 20 వరకు బోరు పాయింట్లు ఈ నందీశ్వరుడు పెట్టినట్లు సమాచారం. 100 శాతం బోర్లు విజయవంతం కావడంతో ఈ నందీశ్వరుని కోసం మూడు రాష్ట్రాల ప్రజలు ఎగబడుతున్నారు.చిత్తూరు జిల్లా వీకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలంలో సాగునీటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఏకంగా ఆరు బోర్లు వేయించాడు. ప్రతి బోరు వెనుక లక్షల రూపాయల ఖర్చు పెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఒక్క చుక్క నీరు కూడా పడలేదు. రైతు తీవ్ర నిరాశలో పడిపోయాడు. అతను రీల్స్ చూస్తుండగా కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు సత్య శనీశ్వర స్వామి దేవస్థానంకు చెందిన శరణ్య అనే ఎద్దు బోరు పాయింట్ పెట్టడం గురించి ఒక వీడియో కనిపించింది. తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో సుమారు 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కర్ణాటకలోని చిక్మంగళూరు ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఉన్న దేవస్థానంలో శరణ్య అనే ఎద్దు యజమానులను కలిసి తన పరిస్థితిని వివరించి చివరకు ఆ ఎద్దును ఆంధ్రప్రదేశ్‌ లోని తెట్టు గ్రామానికి తీసుకొనివచ్చారు. వెంటనే గ్రామస్తులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. పొలంలోకి ఆ ఎద్దును వదిలారు. కొంతసేపు అది అటూ ఇటూ తిరుగుతూ పొలాన్ని పరిశీలించింది. కొద్దిసేపటి తర్వాత ఒక ప్రదేశంలో ఆగి అక్కడే మూత్ర విసర్జన చేసింది. ఎద్దు ఎక్కడ ఇలా చేస్తుందో అక్కడ భూగర్భంలో నీటి నిల్వలు ఉంటాయని భావిస్తారు. రైతు ఆ ఎద్దు పాదాలపై పడి నీటి కోసం పార్దన చేసాడు. ఆ ఎద్దు తన కాలు తీసి రైతు భుజంపై పెట్టింది. ఒకవేళ ఆ ప్రాంతంలో నీళ్లు లేకపోతే రైతు ఎంత ప్రార్థించినా ఆ ఎద్దు తన కాలు అతనిపై పెట్టదని కూడా చెబుతున్నారు. ఎద్దు సూచించిన ప్రదేశంలో వెంటనే బోరు బండి తీసుకొచ్చి డ్రిల్లింగ్ ప్రారంభించారు. గ్రామస్తులందరూ ఆసక్తిగా ఆ ప్రక్రియను గమనించారు. ఆశ్చర్యకరంగా బోరు వేయడం జరుగుతున్నంతసేపు ఆ ఎద్దు అక్కడి నుంచి కదల్లేదని అక్కడి వారు చెబుతున్నారు. కొంతసేపటి తర్వాత భూమి పొరలను దాటి గంగమ్మ పైకి రావడం ప్రారంభమైంది. ఇక ఆ రైతు మరోసారి ఎద్దు కాళ్ళ ఫై పడిపోయాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు ఇప్పుడు ఆ ఎద్దు యజమానిని సంప్రదిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *