సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వెలగపూడి – రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. అక్కడి నిర్మాణాలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత రుణం కింద రూ.3,535 కోట్లు నిధులు నేడు, గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలో ఆసియన్ డెవల్‌పమెంట్ బ్యాంకు(ఏడీబీ) నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు రూ.6,700 కోట్లు, ఏడీబీ రూ.6,700 కోట్లు కలిపి మొత్తం రూ.13,600 కోట్లు అప్పుగా ఇస్తున్నాయి. మరో రూ.1,400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందిస్తోంది. ఈ నిధులను రాష్ట్ర రుణ పరిమితిలో (ఎఫ్‌ఆర్‌బీఎం) లెక్కించకూడదని కేంద్రం నిర్ణయించింది. హడ్కో నుంచి రూ.11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది. అలాగే, జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో రూ.5,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
