సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: నేడు, శుక్రవారం సాయంత్రం తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎన్నికలకు ముందు ఊహించని రీతిలో టీడీపీ కి గుడ్ బై చెప్పి ఎన్నికలలో వైసిపి పార్టీ తరపున పోటీచేసి నరసాపురం ఎంపీ గా గెలుపొంది, గత ఏడాది పైగా, జగన్ సర్కార్ ఫై ప్రశ్నలు, ఆరోపణలు సంధిస్తున్న రఘురామకృష్ణరాజు బహిరంగ సభకు హాజరు కావడమేకాదు, వేదికపై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ను ఆలింగనం చేసుకున్నారు. సభ వేదికపైకి చంద్రబాబు రాగానే రఘురామ ఆత్మీయంగా పలకించారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి, ముందునుంచి రఘురామ మద్దతు తెలుపుతున్నారు. ఈ రోజు తిరుపతిలో నిర్వహిస్తున్న సభకు ఆయన ఢిల్లీ నుంచి వచ్చి హాజరయ్యారు. అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో చంద్రబాబు, మాట్లాడుతూ.. సీఎం జగన్‌రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వమని అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రాజధాని రైతులు, మహిళల పోరాటానికి అభినందనలు తెలిపారు. రాజధాని రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. అమరావతిపై అసెంబ్లీ సాక్షిగా జగన్‌రెడ్డి మాట తప్పారని ఆరోపించారు.. అమరావతి రాజధాని ఏ ఒక్కరికో చెందినది కాదని, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అన్నారు. నటుడు శివాజి, సీపీఐ నారాయణ, సీపీఐ రామకృష్ణ, బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ,, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీమంత్రి పరిటాల సునీత హాజరయ్యారు.
