సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమలాపురంలో జాతీయ రహదారిని ఆనుకుని కామనగరువు అబ్బిరెడ్డి వారి కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పక్కన స్థానికులు వినాయకుని మందిరం నిర్మిస్తున్నారు. అది ప్రభుత్వ స్థలం అని ఆలయ నిర్మాణం వెంటనే తొలగించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు రంగంలోకి దిగటంతో గత 2 రోజులుగా అక్కడి స్థానికులు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు తీవ్ర ఆందోళన చేపట్టారు. స్థానిక సబ్స్టేషన్ సమీపంలోనే ఆలయం నిర్మించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో మొన్న సోమవారం మధ్యాహ్నం అమలాపురం ఆర్డీవో కె.మాధవి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే దేవాలయం శ్లాబ్ నిర్మాణం సైతం పూర్తి చేయడంతో పాటు ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించారు. అయితే వినాయకుని గుడి, ఆంజనేయస్వామి విగ్రహాలను తొలగించాలని ఆర్డీవో పంచాయతీ అధికారులు ఆదేశించారు. అధికారులు ఆ ఏర్పాట్లలో ఉండగా స్థానికులు, బజరంగ్దళ్, వీహెచ్పీ నాయకులు కూడా వందలాది సంఖ్యలో తరలి వచ్చి దేవాలయాన్ని తొలగిస్తే సహించేది లేదని ప్రతి రోజు గంటల కొద్దీ ఆందోళన చేస్తున్నారు. స్థానిక అధికారులు పలు పర్యాయాలు గుడి ప్రధాన దాతలతో, నేతలతో చర్చించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో స్థానికులు ఆందోళన తగ్గేదే లేదని చెపుతున్నారు.
