సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ నామినీ,దక్షిణ భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారీస్ హోరా హోరీగా దూసుకుపోతున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా ఆమె మన భారతీయ సంతతి వ్యక్తులు, అక్కడ స్థిరపడిన భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కమలా హ్యారీస్ ప్రచారం బృందం విడుదల చేసిన ఒక వీడియోను తెలుగు పాటతో రూపొందించారు. సూపర్ డూపర్ విజయం సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాట హిందీ వెర్షన్ మ్యూజిక్ ట్రాక్ ఆధారంగా కమలా హ్యారీస్ ప్రచార గీతాన్ని రూపొందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్-అమెరికన్ వ్యవస్థాపకుడు అజయ్ భూటోరియా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియోలో భారతీయ కమ్యూనిటీకి చెందిన పలువురు నాయకులు కూడా కనిపించారు. కమలా హ్యారీస్‌కు ఓటు వేయాలని వారు కోరారు. కమలకు ఓటు వేయాలని తెలుగు భాషలో కూడా డెమొక్రాటిక్ పార్టీ నేతలు కోరారు. కాగా దక్షిణాసియాకు చెందినవారు అమెరికాలో పెద్ద సంఖ్యలో నివసిస్తు్న్నారు. మొత్తానికి మన తెలుగు భాషకు అమెరికా లో పెద్ద గౌరవమే దక్కింది.
