సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ నుండి నేడు, బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా లేఖలు రాసిందని పేర్కొన్నారు. ఇక ప్రత్యేకించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు అంశాలతో కూడిన లేఖను రాసిందని వెల్లడించారు. ఇందులో ప్రత్యేకించి రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజధాని అమరావతి కి ర్యాపిడ్ ట్రైన్ నెట్వర్క్ గురించి ప్రస్తావించడం జరిగిందన్నారు. అయినా ప్రభుత్వ పెద్దలు మాత్రం దక్షిణాఫ్రికా స్ఫూర్తితో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని తాపత్రయపడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం లో మార్పులు చేయాలంటే, పార్లమెంటే చేయాలని… కేంద్రానికి కూడా ఆ అధికారం లేదని అన్నారు. మూడు రాజధానులు అంశం పై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం శిరసా వహిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్రను నిర్వహిస్తుంటే దానికి ఆటంకాలు కల్గించే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఒకవేళ రేపటి నుండి ప్రారంభమౌతున్న అసెంబ్లీ సమావేశాలలో జగన్ సర్కార్ మొండిగా మరోసారి మూడు రాజధానులు బిల్లును ప్రవేశపెడితే కోర్టు మరొకసారి చివాట్లు పెట్టడం ఖాయమన్నారు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును స్పీకర్ ఆమోదించినా, కోర్టు ముందు నిలవదని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *