సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించినా అమలుచేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఆర్టీసీ యం త్రాంగం సమాయత్తమవుతోంది. ఆగస్టు నెలలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలుచేస్తామంటూ ఇప్పటికే రవాణాశాఖ మంత్రి సంకేతాలు పంపిన నేపథ్యంలో జిల్లా ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈమేరకు ఆర్టీసీ జిల్లా అధికారులు ఒక రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. అలాగే జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) ప్రతిరోజూ సుమారు 75నుంచి 80శాతం వరకూ ఉంటుంది. ఇందులోనూ సుమారుగా 50 శాతం మందికి పైగా మహిళలే ప్రయాణాలు చేస్తుంటారని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే ఈ ఆదాయంలో ఎంతమేర కోత పడుతుందనేదానిపై ఆర్టీసీ అధికారులు లెక్కలు వేస్తున్నారు. మరో కీలక అంశం ఏమిటంటే. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితమా? లేక రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి రావచ్చా? అనేది ఇంకా ప్రశ్నగా ఉంది, ఒకవేళ జిల్లా వరకే పరిమితం అయితే జిల్లా సరిహద్దులు ఏమిటనే దానిపై చర్చ సాగుతోంది. కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లా నుండి కొవ్వూరు, నిడదవోలు, తాళ్లపూడి గోపాలపురం, నల్లజర్ల వంటి మండలాలను కొత్తగా తూర్పుగోదావరిలో కలిపారు.మరికొన్ని ఏలూరు జిల్లాలో ఉన్నాయి. దీనితో ఈ సరిహద్దుల వరకే ఉచిత ప్రయాణం అనుమతిస్తారా? లేక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోనూ ఉచిత ప్రయాణం ఉంటుందా ?ఏసీ బస్సు లలో ఉచిత ప్రయాణాలకు అనుమతిస్తారా? అనే అనుమానం కొనసాగుతోంది. కాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన అతి త్వరలో రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *