సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం రాత్రి ప్రధాని మోడీ జాతినుద్దేశించి ఢిల్లీలో ప్రసంగిస్తూ.. ఆపరేషన్ సిందూర్‌లో బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని, భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ తో మన దేశం వీరత్వాన్ని చాటుకుందన్నారు. మన మహిళల సిందూరాన్ని దూరం చేస్తే.. ఏమవుతుందో చూపించామని చెప్పారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టామన్నారు. పాకిస్థాన్‌లోకి ప్రవేశించి అక్కడ ఉగ్ర శిబిరాలు ఉగ్రవాద కేంద్రాలను సైతం ధ్వంసం చేశామని ఆయన పేర్కొన్నారు. 100 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను సైతం హతమార్చామని ప్రధాని మోదీ వివరించారు. ఉగ్రవాదులపై దాడులకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని గుర్తు చేశారు. పాకిస్థాన్ నిఘా, సాంకేతికత భారత్ ముందు తేలిపోయిందని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ మన స్కూల్స్, ఆస్పత్రులు, గురుద్వారాలను టార్గెట్ చేసిందని పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైల్స్ కూల్చివేశామని ప్రధాని మోదీ తెలిపారు.. మనం మాత్రం పాకిస్థాన్ గుండెల్లో బాంబులు పేల్చామని చెప్పారు. పాకిస్థాన్‌లోని ఎయిర్‌బేస్‌లను సైతం ధ్వంసం చేశామన్నారు. మన దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడి పోయిందని ప్రధాని మోదీ గర్వంగా చెప్పారు. భారత్‌ను ఎదుర్కో లేక ప్రపంచ దేశాల సాయాన్ని పాకిస్థాన్ కోరిందని పాకిస్థాన్ చర్యలను బట్టే మన చర్యలు ఉంటాయని పాక్ అణు బ్లాక్ మెయిలింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలిపారు. త్రివిధ దళాలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ కు పాక్ ఆక్రమిత కాశ్మిర్ ఇచ్చేయవల్సిందేనని, పాక్ కు సింధునది జలాలు నిలివేత కొనసాగుతుందని అయితే భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
