సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని తన కార్యాలయంలో నేడు, శనివారం జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ.. ఈ డిసెంబర్ నెల 15 నుండి నరసాపురం- చెన్నై వందే భారత్ రైలు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు శుభవార్త ప్రకటించారు. రైల్వే శాఖ అడ్వాన్స్ రిజర్వేషన్ పిరియడ్ వల్ల జనవరి 12న ప్రారంభించాలని మొదట ప్రకటించినప్పటికీ ప్రజల విజ్ఞప్తి మేరకు పండగ కంటే ముందే రైలు సర్వీస్ ప్రారంభించాలని తాను చేసిన విజ్ఞప్తికి రైల్వేశాఖమంత్రి తోపాటు అధికారులు అంగీకరించారని కృతజ్ఞతలు తెలిపారు. నర్సాపురం-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20677/20678) రైలు సంఖ్య 20677 (చెన్నై నుండి నరసాపురం) డా. ఎం.జీ.ఆర్ చెన్నై సెంట్రల్ నుండి ఉదయం 05.30 గంటలకు బయలుదేరి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్లలో ఆగి, మధ్యాహ్నం 14.10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది అని, రైలు సంఖ్య 20678 (నరసాపురం నుండి చెన్నై) నరసాపురం నుండి మధ్యాహ్నం 14.50 గంటలకు బయలుదేరి, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగి, రాత్రి 23.45 గంటలకు డా. ఎం.జీ.ఆర్ చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది అన్నారు. ఇంకా బెంగళూరు నుండి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ రైలు నరసాపురం వరకు, సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య నడిచే వందే భారత్ తాడేపల్లిగూడెంలో హాల్ట్ కొరకు తాను చేసిన ప్రతిపాదనకు రైల్వే శాఖ సానుకూలంగా ఉందని మరిన్ని రైల్వే సర్వీసులు జిల్లా వాసులకు అందుబాటులో వస్తాయని అన్నారు.పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ గృహాలకు తాగునీటి సరఫరా కోసం జల్ జీవన్ మిషన్ కింద రూ. 1400 కోట్ల భారీ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.
