సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక అంటూ ప్రకటించి నప్పటికీ గోదావరి జిల్లాలలో వినియోగదారులకు ఇసుక గతం కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని సమాచారం అందుతుంది. దీనికి తోడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆధార్‌కార్డు ఉంటే రోజుకో లారీ ఇసుక ఇస్తుండగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇంటి ప్లాన్ ఉంటేనే ఇసుక ఇవ్వాలని నిబంధన విధించడంతో.. గోడ కట్టాలన్న బాత్రూం లు వంటి చిన్న చిన్న నిర్మాణాలు చేపట్టేవారు కూడా ఇసుక దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఒక వైపు వినియోగదారులు, మరో వైపు టిప్పర్ లారీల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి రెండు జిల్లాల్లోనూ పలు ర్యాంపులలో అసలు ఇసుక లేక ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారంలోనే గోదావరి నది పరివాహక ప్రాంతంలో కొందరు ప్రజా ప్రతినిధులు వారి అనుచరగణం గత ప్రభుత్వ హయాంలో నిల్వ చేసిన భారీ ఇసుక గుట్టలను తరలించి అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి.. ఉన్న కొద్దిపాటి స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.(రాజమహేంద్రవరం రూరల్ లాలా చెరువు యార్డులో ఎన్నికల ఫలితాలు ముందు 1.40 లక్షల టన్నుల ఇసుక ఉండగా అది మాయమయి దాని స్థానంలో ఇప్పుడు నామమాత్రంగా 7,500 టన్నుల ఇసుకను అమ్మకానికి పెట్టారు.) స్టాక్ పాయింట్‌లలో సకాలంలో ఎగుమతులు కాక టిప్పర్ లారీల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.దానికి తోడు నిబంధనలతో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని దీనికి నిరసనగా లారీ అసోసియేషన్ నేటి నుంచి ‘లారీల బంద్‌కు పిలుపునిచ్చింది..గతంలో కోస్తా ఆంధ్రాలో వినియోగ దారుడు ఎక్కడ ఉన్న సరే టన్ను ఇసుక రూ. 950లకే నేరుగా వినియోగదారుని ఇంటికే చేరేది. ఇపుడు స్టాక్ పాయింట్లలోనూ టన్నుకు రూ.1395 రూపాయలు చెల్లించాల్సి వస్తున్నది. దీనికి కిరాయి అదనం. ఇక వైజాగ్, అనకాపల్లి వంటి దూర ప్రాంతాలకు తరలించాలంటే రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోతాయి.అంటే సుమారు గత ధర కంటే ఇపుడు రెట్టింపు అవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్దాంతం, నడిపూడి, కోడేరు, కరుగోరుమిల్లి వద్ద ఇసుక ర్యాంప్‌లున్నాయి. ఈ ర్యాంప్‌ల నుంచి ఉచిత ఇసుక విధానాన్ని కల్పిస్తే తక్కువ రవాణా చార్జీలతో ఆచంట పాలకొల్లు, తణుకు, భీమవరం నియోజకవర్గాలలో నిర్మాణాలు చేపట్టిన వారికీ మేలు జరుగుతుంది.
