సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు, మంగళవారం మీడియా సమావేశంలో .. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జన్మనిచ్చిన అమ్మానాన్నల తరవాత అంతటి ఆప్యాయత, వాత్సల్యం లభించేది గురు దేవుళ్ళ దగ్గరేనని వ్యాఖ్యానించారు. విజ్ఞానాన్ని పంచి తమ శిష్యుల విజయాలను తమవిగా భావిస్తారని గురువులను కొనియాడారు. పవిత్రమైన బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో పాలకులు, ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరి తరచూ విమర్శల పాలవుతోందన్నారు. ఉపాధ్యాయ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందనే మాట వినిపిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి పేరుతొ నాడు-నేడు పనుల్లో పాలక పక్షం చేస్తున్న తప్పులకు ప్రధానోపాధ్యాయులను బలి చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పదోన్నతులు పొందిన, బదిలీ అయిన సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులకు కొద్ది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు.రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం కచ్చితంగా బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి గౌరవమర్యాదలను కాపాడుతుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
