సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన తిరుమలగా ప్రసిద్ధి పొందిన ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో నేడు, బుధవారం ఆశ్వీజ మాస బ్రహ్మోత్సవాలు వేలాది భక్తుల గోవిందా.. గోవిందా జయ జయ ద్వానాల మధ్య ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో నేడు, చిన వెంకన్న భూ సమేత మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే ఈరోజు శ్రీ వారి కళ్యాణం నిమిత్తం స్వామి, అమ్మవార్లను పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్లుగా అలంకరణ చేసి రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారిని ఊరేగించనున్నారు. ఈనెల 9న స్వామి వారి కళ్యాణం, 10 తేదీన రథోత్సవం నిర్వహిస్తారు. . బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.కాగా బుధవారం విజయదశమి సందర్భంగా ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
