సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో స్వర్గీయ బొండాడ సుబ్బారావు దశమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక త్యాగరాజ భవనంలో మూడు రోజులపాటు జరిగే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు శ్రవణ కుమారుని కథ పై ప్రవచన కార్యక్రమాన్ని నేడు, శనివారం నిర్వహించారు. ముందుగా గరికపాటి, ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ .. కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను బాగా చూసుకుంటే కంటికి కనిపించని దైవం తప్పకుండా హర్షిస్తాడని అన్నారు. భీమవరం పట్టణం ఆధ్యాత్మిక నిలయమని, ప్రతిరోజూ ఏదొక ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరుగుతూనే ఉంటాయని, పండితులను గౌరవించే స్థలం మన భీమవరమేనని అన్నారు. గరికపాటి నరసింహారావు ప్రవచనాలు పామరులు కూడా అర్థమయ్యే విధంగా ప్రవచనం చేయడం ఆయనకు భగవంతుడు ఇచ్చిన వరమని, అన్నారు. గరికపాటి మాట్లాడుతూ.. తాను 20 ఏళ్ల వయసులో తన స్వస్థలం తాడేపల్లిగూడెం నుంచి భీమవరంకు సైకిల్ పై వచ్చేవాడినని, నాటకాల కోసం ఈ ప్రాంతానికి వచ్చేవాడినినని, ఇప్పటికి తరచూ భీమవరం వస్తున్నా అంటే ఎంతో ఆనందంగా ఉంటుందని, ఎప్పటికీ భీమవరం కు రుణపడి ఉంటానని అన్నారు. హిందూ పురాణమైన రామాయణంలో శ్రవణ కుమారుడు కథ ఒక ఉదాత్తమైన పాత్ర అని, తల్లిదండ్రుల పట్ల ఎంత అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే ఒక మహోన్నత వ్యక్తిత్వమని అన్నారు. కార్యక్రమంలో ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, చెన్నమల చంద్రశేఖర్, వబిలిశెట్టి కనకరాజు, వబిలిశెట్టి శ్రీవేంకటేశ్వర్లు, వబిలిశెట్టి వేంకటేశ్వరరావు, వబిలిశెట్టి పట్టాభిరామయ్య, వబిలిశెట్టి రామకృష్ణ, జూలూరి వెంకటేష్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, దాయన చంద్రజి, తదితరులు పాల్గొన్నారు.
