సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ ఉచిత వైద్యసేవలకు రోగులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నా జిల్లాలోని రెండు నెట్వర్క్ ఆసుపత్రులకు కలెక్టర్ వెట్రిసెల్వి జరిమానా విధించారు. మరో నెట్వర్క్ ఆసుపత్రిపై వచ్చిన ఫిర్యాదుపై రీ ఎంక్వయిరీ చేయాలని ఆదేశించారు. ఉచిత వైద్యసేవలపై ఇటీవల ఐవీఆర్ఎస్ ఫోన్‌కాల్స్ ద్వారా సంబంధిత రోగుల నుంచి సేకరించిన సమాచారం, నమోదైన ఫిర్యాదులపై గత గురువారం కలెక్టరేట్లో ఎన్టీఆర్ వైద్యసేవలు–జిల్లాస్థాయి క్రమశిక్షణ చర్యల కమిటీ(డీడీసీ) సమావేశం జరిగింది. ఉచితవైద్యసేవ కోసం రిజిస్టరైన రోగి వద్ద ఎక్స్‌రే నిమిత్తం డబ్బులు వసూలు చేశారనే కారణంపై ఏలూరు గుడ్సమరిటన్ క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యానికి రూ.3,500, ఎన్టీఆర్ ఉచిత వైద్యసేవ కింద ఆసుపత్రిలో చేరిన గర్భిణీకి జన్మించిన శిశువుకు ఇన్వెస్టిగేషన్స్ నిమిత్తం డబ్బులు వసూ లు చేశారనే అభియోగంపై జంగారెడ్డిగూడెం సాయిస్ఫూర్తి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ యాజ మాన్యానికి రూ.40 వేలు జరిమానా విధించారు. వసూలు చేసిన డబ్బు లకు నిబంధనల ప్రకారం పది రెట్లు జరిమానాగా విధిస్తారు. ఔషధా లను బయట కొనుగోలు చేసినట్టు ఓ రోగి ఫిర్యాదు చేసిన కేసులో నూజివీడులోని జిఫర్డ్ మెమోరియల్ హాస్పిటల్‌పై మరోదఫా విచారణ చేసి, తదుపరి సమీక్ష సమావేశానికి నివేదికను అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద నమోదైన ప్రతీ నెట్వర్క్ ఆసుపత్రిలో నగదు రహిత ఉచిత వైద్యసేవలు అందరికీ అర్థమయ్యేలా ఫ్లెక్సీ బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు. రోగి డిశ్చార్జి అయిన తర్వాత మందులు, రవాణా చార్జీలు ఇవ్వాల్సిందేనన్నారు.
