సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సంపర్క్‌ అభియాన్‌’లో భాగంగా విశాఖ పట్నం, రైల్వే ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో గత ఆదివారంరాత్రి నిర్వహించిన బహిరంగసభలో హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ .. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ లో అవినీతి తప్ప ఇంకేమీ కనిపించడం లేదని .. దేశంలో రైతుల ఆత్మహత్యలతో ఏపీ 3వ స్థానంలో ఉందని సీఎం జగన్ సిగ్గుపడాలన్నారు. బియ్యం పంపిణి మొదలు అన్ని కేంద్ర పథకాలపై జగన్‌ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నాన్ని భూ రాబందుల మాఫియా కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. రైతుల కోసం కేంద్రం ఏటా రూ.6 వేల చొప్పున ఇస్తుంటే.. జగన్‌ అవి తానే ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. యూపీఏ పాలనలో 2009 నుంచి 14 వరకు ఏపీకి రూ.78 వేల కోట్లు ఇవ్వగా.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2014-19 వరకు రూ.2.7 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. ఆ డబ్బుకు సరిపడా అభివృద్ధి కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఔషధాల తయారీలో కూడా కల్తీ జరుగుతోందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ప్రభుత్వం రెండు వందేభారత్‌ రైళ్లను మంజూరు చేసిందని.. విశాఖ రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.450 కోట్లు మంజూరు చేశామన్నారు. ‘ఏపీలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లతో పాటు సాగరమాల కింద మరో రూ.85 వేల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేశాం. కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి నగరాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నాం. తిరుపతిలో ఐఐటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్‌, తాడేపల్లిగూడెంలో నిట్‌, శ్రీసిటీలో ఐఐఐటీ, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటుచేశాం. మరో మూడు మెడికల్‌ కాలేజీలు ఇచ్చాం. కాకినాడకు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ మంజూరుచేశాం’ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *