సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలను అతిత్వరలో ఏర్పాటుచేయనుంది. దీనికి సంబంధించి నేడు, మంగళవారం లేదా రేపు బుధవారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. రానున్న తెలుగు ఉగాది పర్వదినం లోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలు ఏర్పాటు అనుకున్నప్పటికీ ఈలోపు 2021 జనాభా గణన ముందుకురావడంతో పునర్వ్యవస్థీకరణ ఆలస్యమైంది. కానీ, కరోనా నేపథ్యంలో జనాభా గణన ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అది మొదలయ్యేలోపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు పెరగనుంది. ఆరుకు పార్లమెంట్ నియోజక వర్గ పరిధి పెద్దది కావడంతో దానిని 2 జిల్లాలుగా మార్చనున్నారు.
