సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా కలకలం రేపిన కల్తీ దగ్గు మందు వ్యవహారంపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో కల్తీ మందు సరఫరా కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు మంత్రి. రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులు సూచించవద్దని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గుంటూరులో మెలియాయిడోసిస్‌తో మహిళ మృతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కల్తీ దగ్గు మందు తాగి పిల్లలు చనిపోయిన ఘటన సంగతి తెలిసిందే. అయితే ఏపీకి ఆ దగ్గు మందు సరఫరా కాలేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఈ తాజా పరిణామాలపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండియన్, ఔషధ నియంత్రణ పరిపాలనా ఇంఛార్జ్ డైరెక్టర్ జనరల్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ గిరీశ మంత్రికి నివేదికలు అందించారు.
