సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు పోర్ట్ లో షిప్ ను సీల్ వెయ్యమని అధికారులను ఆదేశించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టులోని ఓ షిప్ బార్జిలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్‌ బియ్యాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత యథేచ్ఛగా రేషన్‌ బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతుంటే ఏం చేస్తున్నారని, మాఫియాకు కొమ్ము కాస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై పవన్ మీడియా తో మాట్లాడుతూ.. కాకినాడ పోర్టు రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిపోయిందని ఇంత పెద్ద ఎత్తున భారీగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తీరప్రాంత జిల్లాల్లో ఏ మాత్రం భద్రత లేకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇది దేశ భద్రతకే తీవ్ర ముప్పుగా పరిగణిస్తుందన్నారు. పోర్టు నుంచి యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో ఉగ్రవాదులు పేలుడు, మత్తు పదార్థాలు దిగుమతి చెయ్యటం లేదని గ్యారెంటీ ఏంటని? ప్రశ్నించారు. కాకినాడ అత్యంత ప్రమాదకరమైన పోర్టు అని ప్రధాని, కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని ప్రకటించారు. పోర్టులో తనిఖీలకు వెళ్లాలనుకుంటే రెండునెలలుగా తనను అధికారులు అడ్డుకుంటున్నారని, తానొస్తే పదివేల కుటుంబాల బ్రతుకులు నాశనం అవుతాయని సెంటిమెంట్ మాటలు చెపుతున్నారని, ఉప ముఖ్యమంత్రి నాకే అధికారులు సహకరించటం లేదంటే .. ఈ రాకెట్ వెనుక మూలాలు ఎంత పెద్ద స్థాయిలో విస్తరించి ఉన్నాయో అర్ధం అవుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *