సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారులో పెదమిరం లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం ) ట్రస్ట్ ద్వారా దశాబ్దాలుగా వేలాది క్యాన్సర్ రోగులకు విశేష సేవలందించిన సేవా మూర్తి, శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్.రాజు (95)ఇకలేరు. ట్రస్ట్ భవనంలోనే గత మంగళవారం తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు ఆయన పార్థివ కాయంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళ్లు అర్పించారు. పెద అమిరంలో 1931లో జన్మించిన ఎంఆర్.రాజు ప్రాథమిక విద్య భీమవరం లోనే సాగింది. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించి అక్కడే డాక్టరేట్ చేసిన తర్వాత అమెరికా వెళ్లారు. లాస్ అల్మాస్ డిఫెన్స్ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా పని చేశారు. అనంతరం స్వదేశంలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందించే లక్ష్యంతో మాతృభూమికి తిరిగివచ్చి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అతి సామాన్య ఖర్చులతో సేవ లందించారు. 2006లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పెద అమిరంలోని ఎంజీఎం ట్రస్ట్‌ను సందర్శించి తన సన్నిహిత మిత్రుడు ఎంఆర్.రాజు పేదప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. 2013లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని ఎంఆర్ అందుకున్నారు.
