సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో సీపీఐ ఆధ్వర్యంలో నేడు, సోమవారం కొత్తపూసలమర్రు పేదలు గూట్లపాడు సచివాలయం వద్ద ధర్నా చేపట్టి నివేశనా స్థలాలకై సచివాలయ కార్యదర్శి సీహెచ్ రమాలీలకు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల భీమారావు మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో పేదలకు పట్టణ ప్రాంతాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర ఇచ్చిన చాలీచాలని ఇంటి స్థలాలు స్థానే తాము పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే ఇళ్లు లేని నిరుపేదలకు 3 సెంట్లు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసి గృహాలు నిర్మించి ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని భీమారావు కోరారు. కూటమి సర్కారు అధికారం చేపట్టి ఐదు నెలలు కావస్తుందని నివేశనా స్ధలాలు, గృహ నిర్మాణం పై కార్యాచరణ చేపట్టకపోవడం దారుణమని భీమారావు అసహనం వ్యక్తం చేశారు.కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చని పక్షంలో పెను ఉద్యమాలు చేయడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ రూరల్ మండల కార్యదర్శి ఎం.సీతారాంప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి,సీపీఐ జిల్లా సమితి సభ్యులు తిరుమాని కామేశ్వరరావు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
