సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ని విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న స్వంత కుమారుడే మమకారం మరచి తల్లిదండ్రులను ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేసి తన రాక్షసత్వాన్ని చాటుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే. నడుపూరి కల్లాలు గ్రామానికి చెందిన పాండ్రంకి అప్పలనాయుడు (55), జయ (45)కు కుమారుడు రాజశేఖర్, కుమార్తె రాధాకుమారి ఉన్నారు. రాధాకుమారికి కొన్నేళ్ల కిందట వివాహం సమయంలో తమకున్న ఎకరా భూమిలో 20సెంట్లు ఆమెకు తల్లిదండ్రులు రాసిచ్చారు. అయితే, ఐదేళ్ల క్రితం రాధాకుమారి భర్త చనిపోగా కుమారుడితో కలిసి ఆమె తన ఇంటివద్ద నివాసం ఉంటుంది. విధవరాలు అయిన కుమార్తె ను అన్న రాజశేఖర్ సరిగ్గా పట్టించుకోవడం లేదని భావించిన తల్లిదండ్రులు తమకు మిగిలిన భూమిలో మరో 30 సెంట్లను కుమార్తె పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో తల్లిదండ్రులపై రాజశేఖర్ కక్ష పెంచుకున్నాడు. గత శనివారం పొలం దున్నేందుకు రాజశేఖర్ ట్రాక్టర్ తో వెళ్లాడు. అక్కడ కనపడిన తల్లిదండ్రులుపై ట్రాక్టర్ ను ఎక్కించే ప్రయత్నం చేశాడు. దీంతో భయంతో వారిద్దరు పక్కనే ఉన్న మొక్కజొన్న పొలంలో పారిపోయినప్పటికీ వదలకుండా ట్రాక్టర్ ను పోనిచ్చి సొంత తల్లిదండ్రులను ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశాడు. అనంతరం అతని భార్యతో కలిసి జిల్లా కేంద్రంలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
