సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు, హిందీ సినిమాలలో ఎన్నో అద్భుతమైన సన్నివేశాల సృష్టి కర్త కే విశ్వనాధ్ చిత్రింకరించిన సన్నివేశాలలో తరాలు మారిన ప్రపంచం లో ఇంత గొప్పగా ఒక సాధారణ సన్నివేశాన్ని ఎవరు చిత్రీకరించలేరు అన్న సన్నివేశం సాగర సంగమం లో ఉంది. ఆసినిమాలో ఆలిండియా డాన్స్ ఫెస్టివల్స్ ఇన్విటేషన్‌లో తన పేరు చూసి బాలు (కమల్‌హాసన్) భావోద్వేగానికి గురయ్యే సీన్ ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులు పాల్గొనే ఆ పోటీల్లో హాజరు కావాలన్నా, ఆ ఫెస్టివల్‌లో నృత్య ప్రదర్శన ఇవ్వాలంటే అదృష్టం ఉండాలని తనకు అది లేదని నుదిటిపై బ్రొటన వేలితో రాసి చూపిస్తాడు కమల్. తనకు గతంలో ఒకసారి ఆ ప్రదర్శన చూసేందుకు ఇన్విటేషన్ వచ్చినా.. డబ్బుల్లేక వెళ్లలేకపోయినట్టు జయప్రద్ కు చెబుతాడు. అప్పుడు.. ఈసారి ఫెస్టివల్‌కి తన దగ్గర ఇన్విటేషన్ ఉన్నట్టు చెబుతుంది జయప్రద. ఆమె దగ్గర ఉన్న ఇన్విటేషన్ తీసుకుని.. ఒక్కొక్క పేజీ తిప్పుతూ.. ‘ఈసారి అందరూ పెద్దవాళ్లేనండీ’ అంటూ వారిని కీర్తిస్తుంటాడు కమల్. ఆ ఆహ్వాన పత్రిక చివరిపేజీలో ‘క్లాసికల్ డాన్సర్’గా తన పేరు చూసి.. ఆనందం తట్టుకోలేక , ఆశ్చర్యంతో, దుఃఖంతో.. కమల్‌హాసన్ గుండె ఆగిపోతుందేమో?అన్న సందేహం వస్తుంది! వెంటనే జయప్రద చేతిని పట్టుకుని. ఏమిటి చిన్నపిల్లాడిలాగా.. అంటూ జయప్రద ఊరడిస్తుంటుంది. ఈ సీన్‌లో కెమెరా రన్ అవుతుండగానే విశ్వనాథ్‌కు ఒక ఆలోచన వచ్చింది. కమల్‌హాసన్‌ను ఉద్దేశించి.. ఏడుపులో ఆనందాన్ని కూడా మిళితం చేయాల్సిందిగా సూచించారు. ఆయన సూచన విన్న కమల్‌హాసన్.. తల కూడా తిప్పకుండానే ఆయన మనసులో మాటను అర్థం చేసుకుని తన ఏడుపును నవ్వుగా మారుస్తూ నవ్వుతూ.. నవ్వుతూనే ఏడుస్తూ.. సీన్‌ను ఎవరూ ఊహించనంత గొప్పగా పండించారు! అందుకే.. తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయే అద్భుత సన్నివేశాల్లో అది ఒకటిగా నిలిచిపోయింది.
