సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో, మరియు ముమ్ముడి వరం మండలం కొత్తపాలెం లో నేడు (శుక్రవారం) మధ్యాహ్నం నుండి సంక్రాంతి ప్రసిద్ధమైన ప్రభల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. . ఈ ఉత్సవం కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. సుమారు 450 ఏళ్లు చరిత్ర కలిగిన ఈ సంప్రదాయ ఉత్సవంలో ఏకాదశ రుద్రుల ప్రభలు 11 గ్రామాల నుంచి ఊరేగింపుగా జగ్గన్నతోటకు తరలి వచ్చాయి. అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో నేడు కనుమ పండుగ నేపథ్యంలో ప్రతి ఇంట పితృదేవతల పేరిట నూతన వస్త్రాలు, బియ్యం వితరణ, పశువులకు ప్రత్యేక అలంకరణ, పూజలు, పలు ఆలయాల వద్ద తీర్థ మహోత్సవాలు, అర్చనలు, అభిషేకాలు వీటన్నిటిని మించి సంప్రదాయంగా చేస్తున్న ప్రభల తీర్ధాలు.. ప్రతి గ్రామం నుండి వారి దేవాలయాల నుండి ప్రభలు భారీ ఎత్తున మేళతాళాలతో పచ్చని పంట పొలాలలోకి సెలయేళ్ళు దాటుతూ యువకులు 25 అడుగుల నుండి 10 అడుగుల దేవుళ్ళ ప్రభలను మోస్తూ తరలి వెళ్లి సాయంత్రం వరకు కొలువు దిరటం అపూర్వము ఆ ప్రాంత ప్రజలు అందరు అక్కడ ఏర్పాటు చేసిన తీర్ధంలో వేలాదిగా పాల్గొని వారి ప్రాంతాల ప్రభల వద్ద దేవుళ్ళకు పువ్వులు పళ్ళు సమర్పించడం గొప్ప అనుభూతి.తిరిగి నేటి రాత్రి పొద్దు పోయే సమయానికి ప్రభలను తిరిగి తమ గ్రామాలకు తీసుకొనివెళ్తారు. ప్రభల తీర్ధం సంబరాలు అంబరాన్ని అంటాయి.
