సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇండియా కూటమి తాము బరిలో లేమని ప్రకటించడం తో ప్రధాని మోదీ వరుసగా మూడో సారి అధికారం చేపట్టనుండడంతో దేశీయ సూచీలు లాభాల బాటలో పయనించాయి. ఎన్నికల రోజు ఎదురైన భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాలు అందుకున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం కూడా సూచీల సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ఫలితంగా సెన్సెక్స్ లైఫ్‌టైమ్ హైకు చేరుకుంది. నేడు, శుక్రవారం ఉదయం 75,031 వద్ద లాభాలతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ రోజంతా అదే దూకుడును కొనసాగించింది. 76,759 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసింది. చివరకు 1618 పాయింట్ల లాభంతో 76,693 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ 468 పాయింట్ల లాభంతో 23,290 వద్ద స్థిరపడింది. రిలయన్స్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్ వంటి కంపెనీల్లో కొనుగోళ్లు జరగడం సెన్సెక్స్‌కు కలిసొచ్చింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీలూ లాభాలను అందుకున్నాయి. విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు బాగా లాభపడ్డాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.38గా ఉంది.
