సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హీరోలు ఎవరైనా సరే.. వారి సినిమాల బహిరంగ ప్రమోషన్స్ మాటేమోగాని అభిమానులు ప్రాణాలు పోతున్నాయి. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) బైక్‌పై మొన్న శనివారం రాత్రి రాజమహేంద్రవరం రూరల్ మండలం వేమగిరిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారు. వారు తిరిగి కాకినాడ బయలుదేరారు. అయితే రాత్రి 9.40 గంటలకు వడిశలేరులో ఎదురుగా వస్తున్న వ్యాన్ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టగా తీవ్రగాయాల పాలయ్యారు. దీంతో ఇద్దరినీ వారి స్నేహితులు ఫోన్ చెయ్యగానే వచ్చిన 108 వాహనంలో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ మృతిచెందాడని వైద్యులు తెలిపారు. కొనఊపిరితో ఉన్న చరణ్‌ను చికిత్స నిమిత్తం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 12.15 గంటలకు మృతిచెందాడు. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతిచెందడం బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు.వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని చెప్పారు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నామని అన్నారు. తీవ్ర విషాదం లో మునిగిన ఆ ఇద్దరి యువకుల కుటుంబాలను సినిమా నిర్మాతలు , హీరో, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకొంటాయో? చూడాలి..
