సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో తొలిసారి ఒక విభిన్న ప్రయోగంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తాజగా జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. 2020 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ప్రొబేషన్ ప్రకటించింది. శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈ ప్రొబేషన్ ఇస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గత సోమవారం రాత్రి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. ప్రొబేషన్ అందుకున్న వారికి మే-01 నుంచి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయి. ( సాధారణంగా 22 వేల రూపాయలు పైగా జీతాలు ఉన్న వీరికి అదనంగా 7వేల రూపాయల పైగా వారి ఉద్యోగ హోదాల ప్రకారం జీతాలు పెరిగాయి.) ఈ మేరకు జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
