సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో దానికి మద్దతుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు, ఆదివారం ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు. స్వామి వారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే హిందూ అధికారులు, బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదని పవన్ ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగులు సైలెంట్‌గా ఉండి మహా అపరాధం చేశారని, అందుకే తాను దీక్ష తీసుకున్నానని పవన్ చెప్పారు. చర్చికి, మసీదులో ఇలాంటి అపరాధం జరిగితే జగన్ ఊరుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలను నిందించడానికో రాజకీయ లబ్ది కోసం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. క్యాబినెట్ , అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాలని, సీబీఐ విచారణకు ఇవ్వాలో లేదో సీఎం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజలంతా చంద్రబాబు వెనుకే ఉంటారని అభిప్రాయపడ్డారు. ( ఇదిలా ఉండగా జగన్ స్వయంగా ప్రధాని మోడీ కి రాసిన లేఖలో కేంద్ర దర్యాప్తు సంస్థ తో విచారణ జరిపించాలని కోరటం గమనార్హం)
