సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షిస్తుండగా ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తుండగా.. కోట్లాది భారతీయుల ప్రార్థనలు ఫలించగా.. నేటి బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 మిషన్ ‘ల్యాండర్ విక్రమ్’ విజయవంతంగా సాఫ్ట్‌గా లాండయ్యింది. రాళ్లు, గుంతలు లేని ప్రదేశంలో సురక్షితంగా ల్యాండయ్యింది. ఈ అత్యద్భుత ఖగోళ ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతోపాటు విదేశీయులు కూడా ఎంతో ఆసక్తిగా తిలకించారు. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టింది. బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలు ఉప్పొంగిపోయారు. వర్చువల్‌గా బెంగళూరు కేంద్రంలోని శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ ఉత్సాహపరిచారు. ల్యాండింగ్ విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులపై ప్రశంజల జల్లు కురిపించారు.
