సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో యువతరాన్ని, విద్యార్థులను టార్గెట్గా అమ్మకాలు చేస్తున్న గంజాయి ముఠాలపై పోలీసులు 6 ప్రత్యేక టీములతో నిఘా పెంచారు. దీనిలో భాగంగా గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా విశాఖ జిల్లా పాడేరు, తదితర ప్రాంతాల నుంచి భీమవరానికి గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు భీమవరం టూటౌన్ సీఐ కృష్ణకుమార్ తెలిపారు. 2వ పట్టణ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నరసింహపురం రైల్వే గేటు సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈనెల 17వ తేదీ సాయంత్రం 5గంటలకు సీఐ, ఎస్‌ఐలు రాంబాబు, అప్పారావు, సిబ్బంది దాడి చేశారు. పాత రేకుల షెడ్డులో కాళ్ళ మండలం దొడ్డనపూడికి చెందిన రౌడీ షీటర్ రాట్నాల సత్యసాయి (కటౌట్ సాయి), కాళ్ళ మండలం కోపల్లెకు చెందిన చిల్లా డాని గంజాయిని విక్రయించడానికి వాటాలు వేసుకుంటుండగా వారిని అదుపులోకి తీసుకొన్నారు.. వారి వద్ద రూ.లక్షా 50 వేల విలువైన 25 కేజీల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సత్యసాయిపై ఆకివీడు పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీటు ఉందని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు రాంబాబు, పద్మారావు, సిబ్బంది పాల్గొన్నారు.. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ నరసాపురం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని గత ఆదివారం ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి సరఫరా పెరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. పోలీసు దాడుల్లో 14 మందిని సరఫరాదారులను పట్టుకుని వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసు దర్యాప్తులో ఇప్పటి వరకు 57 మంది బయట ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి జిల్లాలో సరఫరా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. గంజాయికి బానిసైన 150 మందిని గుర్తించి, వారికి కౌనెల్సింగ్ చేస్తున్నామన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులు పెరిగాయని,వాటిపై కూడా నిఘా పెడతామని ప్రకటించారు.
