సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు కు నేటి శనివారానికి 50 రోజులు గడుస్తున్నాయి. గతంలో తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏకంగా 20కి పైగా కేసులలో తనపై విచారణ జరగకుండా కోర్ట్ స్టేలు తెచ్చుకొన్న ఆయనకు ప్రస్తుతం కాలం కలసిరావడం లేదనిపిస్తుంది. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ గత గురువారం వేసిన అనుబంధ పిటిషన్‌లపై విచారణ నుంచి హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఎవరు ఊహించని రీతిలో తప్పుకొన్నారు. వ్యాజ్యంలో ఇటీవల వకాలత్ వేసిన న్యాయవాది ఓ న్యాయాధికారి భర్త అని, సంబంధిత న్యాయవాదికి చెందిన పిటిషన్లను తాను విచారించలేనని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుంచి ప్రస్తుతం కోర్ట్ సెలవులు నేపథ్యంలో తదుపరి పనిదినం నాడు(ఈనెల 30) విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ దశలో చంద్రబాబు తరఫుసీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ… వ్యాజ్యంపై వెకేషన్ బెంచ్‌లో విచారణ జరపాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ కోరేందుకు తమకు అడ్డంకిగా మారుతుందన్నారు. ఉత్తర్వులలో తేదీని ఎత్తివేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించేందుకు, నిబంధనల ప్రకారం వ్యాజ్యాన్ని తగిన బెంచ్ ముందు విచారణకు ఉంచేందుకు తన ఉత్తర్వులు అడ్డంకి కాబోవని స్పష్టం చేశారు.
