సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా దేశానికీ చెందిన టెక్‌టాక్‌పై భారత్ లో నిషేధం ఎత్తేసారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈ నిషేధం ఇంకా కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తూ భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అలా జరిగినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే’ అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. టిక్‌టాక్ వెబ్‌సైట్ కొందరికి అందుబాటులోకి వచ్చిందని, వీడియోలు కూడా అప్‌లోడ్ చేయగలిగారన్న వార్తలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లు ఇప్పటికీ బ్లాక్ చేసి ఉంచారని టెలికాం శాఖ పేర్కొంది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారత్, చైనాలు దౌత్యపరంగా, వాణిజ్యపరంగా ప్రస్తుతం దగ్గరవుతున్న విషయం తెలిసిందే. అయితే, 2020 నాటి గల్వాన్ ఘర్షణల తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో టిక్‌టాక్‌పై భారత్ నిషేధం విధించింది. మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధించింది. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు మధ్య సంబంధాల బలోపేతానికి పలు చర్యలు ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ టియాన్‌జిన్‌లో జరగనున్న షాంఘాయ్ కొఆపరేషన్ సదస్సులో పాల్గొనేందుకు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలో పర్యటించనున్నారు.
