సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడులో నేడు గురువారం, డీఎండీకే అధినేత, సీనియర్ సినీ హీరో విజయ్ కాంత్ మృతి చెందారు. తమిళనాడు ఆరోగ్యశాఖ సెక్రటరీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్‌ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. నిజానికి గత 3 ఏళ్లుగా తరుచు విజయకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురవుతూ మరల కోలుకోవడం జరుగుతూనే ఉంది..విజయ్ కాంత్ 1952 ఆగస్ట్ 25న జన్మించారు. తమిళ సినీ పరిశ్రమలో రజని కాంత్ తరువాత అంతటి మాస్ హీరోగా కొనసాగారు. ‘ఇనిక్కుం ఇలామై’తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎక్కువగా ఆయన తన సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించారు. ఆయన ఫైట్స్ విభిన్నంగా ఉండేవి. విజయకాంత్ నటించిన 100వ చిత్రం ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలవడం ఆరంభించారు. కెప్టెన్ టివి ఛానెల్ కూడా ప్రారంభించారు. తెలుగు నాట డబ్ అయిన సిందూర పువ్వు, నాగాలిపట్టిన నాయకుడు,సిటీ పోలీస్, సెల్యూట్ వంటి పలు చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ఆయన రాజకీయాల దిశగా తన ప్రస్థానం సాగించారు. 2005 సెప్టెంబర్ 14న డీఎండీకే పార్టీని విజయ్ కాంత్ స్థాపించారు. 2006లో తొలిసారిగా ఆయన ఒక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2011లో జయలలిత తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగితే ఆయన పార్టీ ప్రతిపక్ష డి ఎం కె కన్నా ఎక్కువగా 29 స్థానాలలో గెలచి సంచలనం రేపింది. జయలలిత ఉప ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చిన తిరస్కరించి ఆయన శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లో పనిచేసిన నిబద్దత కలిగిన మొండివాడు… తదుపరి వయస్సు ఫై బడటం ఆరోగ్యం నెమ్మదించడం పార్టీ ఫై పట్టు కోల్పోతూ వచ్చారు. ఏమైనా తమిళ పరిశ్రమలో ఒక లెజెండ్’ విజయకాంత్..
