సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండల పరిధిలో డేగాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు, శుక్రవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకొన్నారు. పలువురు గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా, అక్కడే ఉన్న వివిధ శాఖల అధికారులతో సమస్యలపై చర్చించి అవకాశం మేరకు పరిష్కరించారు. గ్రామంలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నా హయాంలో ఈ డేగపురం గ్రామంలో సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ల ను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అదేవిధంగా సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. గ్రామస్తులకు స్వచ్ఛమైన త్రాగు నీటిని అందించేందుకు జలజీవన్ మిషన్ పథకం ద్వారా సుమారు రెండు కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా మూడున్నర ఏళ్లలో గ్రామస్తులకు సుమారు 15 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం లక్ష 70 వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి కుటుంబానికి మేలు చేశారని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో పేదల ఇళ్ల కోసం 300 ఎకరాలు సమీకరించి. 15వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసామన్నారు.
