సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నేడు, బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్‌లో లోక్‌సభ సమావేశానికి హాజరైన అనంతరం నేటి సాయంత్రం భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యాలయానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెళ్తుండగా విజయ్ చౌక్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస వర్మ కాలికి తీవ్ర గాయమైంది. కేంద్ర మంత్రి కార్యాలయంలో వైద్య బృందం శ్రీనివాస వర్మ కు ప్రత్యేక చికిత్స అందించారు. కాలికి బలమైన గాయం కావడం వల్ల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అయితే నరసాపురం పార్లమెంట్ పరిధిలో గురువారం పలు కార్యక్రమాల్లో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పాల్గొనవలసి ఉండటంతో ఢిల్లీ నుంచి భీమవరం లోని తన స్వగృహానికి ఆయన బయలుదేరారు.
