సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది. ఇది నేటి శనివారం మధ్యాహ్నం పుదుచ్చేరి (కారైక్కాల్) – మహాబలిపురం మధ్య తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ చెన్నై ప్రాంతీయ కేంద్రం అంచనా వేసింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం ఫెంగల్ తుఫాను చెన్నై నగరానికి సుమారుగా 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అలాగే, చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్ళూరు, కాంచీపురం కడలూరు జిల్లాల సహా మొత్తం 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.ఏపీలో కూడా రాయలసీమ లో భారీ వర్షాలు తో పాటు గోదావరి జిల్లాలలో కోస్తా ఆంధ్రాలో విపరీతమైన చలిగాలులతో పాటు చెదురు మదురుగా వర్షాలు కురుస్తున్నాయి. భీమవరంలో మొన్న, నిన్న నేడు, శనివారం కూడా చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి.అయితే ఈ డెల్టా ప్రాంతాలలో పొలాలలో కోతకు సిద్ధంగా ఏపుగా పెరుగుతున్న వరిపంటకు ఇప్పటివరకు పెద్దగా నష్టం లేదు.. ఇక్కడకు సమీపంలోని పేరు పాలెం బీచ్ లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. భారీ పెనుగాలులతో పాటు సముద్రం సుమారువంద మీటర్లు ముందుకు వచ్చిందని సమాచారం అందుతుంది. ఈ వర్షాల ప్రభావం రేపు ఎల్లుండి కూడా ఉండే అవకాశము ఉంది.
