సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో సముద్ర తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. నేడు, బుధవారం భీమవరం మండలంలోని నాగిడి పాలెం గ్రామంలో గడపగడపకు తిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అని ప్రజలను ఆరా తీశారు. ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో యనమదురు డ్రైన్ వద్ద ఇవతల వైపు నుంచి అవతల వైపుకు వెళ్లడానికి ప్రజలు భీమవరం మీదుగా 20 కిలోమీటర్లు తిరిగిరావాల్సివచ్చేదని, అప్పట్లో ఈ ప్రాంత ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో యనమదుర్రు డ్రైన్ పై వంతెనల నిర్మాణాలకు మోక్షం కల్పించడం జరిగిందని.. అయితే తరువాత గత టీడీపీ పాలకులు ఈ వంతెనలకు అప్రోచ్ రోడ్లను నిర్మించకుండా వంతెనలను నిరుపయోగంగా మార్చారని ఆరోపించారు కాగా ఇటీవలే తోక తిప్ప, గొల్లవానితిప్ప, భీమవరం టౌన్ చేపల మార్కెట్ వద్ద వంతెనలకు అప్రోచ్ రోడ్లను నిర్మించడానికి 36 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగిందని, త్వరలోనే టెండర్ ప్రక్రియ జరుగుతుంది అని అన్నారు. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంత గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు జల జీవన్ మిషన్ ద్వారా భీమవరం మండలానికి 11 కోట్ల నిధులను మంజూరు చేయించగా, ఇందులో నాగిడి పాలెం గ్రామానికి రూ 97 లక్షలు నిధులు మంజూరయ్యాయి అన్నారు. ఇప్పటికే ఈ పనులు దిరుసుమర్రు గ్రామం నుండి ప్రారంభమయ్యాయని అన్నారు. కరోనా కష్టకాలంలో ఆక్వా రంగం లాక్ డౌన్ తో కుదేలవుతుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి చొరవ చూపి ఈ ప్రాంత ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లను తెరిపించి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి లతో మాట్లాడి ఎగుమతులు చేయించారన్నారు. దీంతో ఈ ప్రాంత రైతులు నష్టపోకుండా మన జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలైన టిడిపి, జనసేన పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, జడ్పిటిసి సభ్యుడు కాండ్రేగుల నరసింహారావు, తాసిల్దార్ వై రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
