సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోని జిల్లాలతో పాటు నెల్లూరు, విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షం నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గోదావరి జిల్లాలలో తీవ్ర చలిగాలులతో పాటు వర్షపు జల్లులు పడుతున్నాయి. ఆకాశం మేఘావృతం గా ఉండిపోయింది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతుందని నెమ్మదిగా కదులుతుండటంతో తీరాన్ని చేరేవరకు లేదా మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అందువల్ల రైతులు వరి కోతలు కోయవద్దని అధికారులు సూచిస్తున్నారు. రెండు, మూడు రోజుల క్రితం కోసిన వరి పైరును కుప్పలు వేసుకుంటున్నారు. భీమవరం నరసాపురం తీరప్రాంతం తో సహా కోస్తా తీరంలో సముద్రంలో చేపల వేటను అధికారులు తాత్కాలికంగా నిషేదించారు.
