సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ తో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటి సాయంత్రం ముగిసింది. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నేడు, గురువారం నవంబర్ 30న పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే జనాలంతా ఎగ్జిట్ పోల్స్ కోసం టీవీలకు, గూగుల్‌కు అతుక్కుపోయారు. నేడు, గురువారం కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా.. తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో..ముఖ్యముగా గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ మందకొడిగా ఉందని సమాచారం అందుతోంది. మొత్తం మీద తెలంగాణలో 66 నుంచి 70 శాతం మధ్యలోనే పోలింగ్ నమోదవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గనుంది. 2018 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదైంది. కాగా రాత్రి 7 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని ఈసీ అధికారికంగా ప్రకటిస్తుంది.
