సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 33 జిల్లాలకు అనుగుణంగా ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లతో కొత్త జోనల్ విధానానికి కొద్దినెలల కిందే రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్ల వారీగా ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏయే పోస్టులు ఏయే కేడర్ల కిందకు వస్తాయన్నది ఇప్పటికే ఖరారు చేసింది.రాష్ట్రంలో కొత్త జిల్లాల ఉద్యోగుల విభజన పక్రియ ను కెసిఆర్ సర్కార్ వేగతరం చేసింది. జిల్లా కేడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. తొలుత కోడ్ లేని జిల్లాల్లో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టనుంది. మిగతా జిల్లాల్లో ఈ నెల 16 తర్వాత ప్రక్రియ మొదలుపెట్టనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి.. కొత్త జిల్లాల మధ్య పోస్టులను విభజించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీచేయనుంది అని సమాచారం. ఇక ఉపాధ్యాయుల విభజనకు సంబంధించి మరో సమావేశం నిర్వహించాక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం
