సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు, శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రోశయ్య, తమిళనాడు గవర్నర్‌గానూ పనిచేశారు. గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన రోశయ్య, దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.సహనశీలిగా, మంచి వాగ్దాటితో పాటు , రాజకీయాలకు అతీతంగా ఉత్తమ రాజకీయ విలువలు పాటించిన నేతగా, వరుసగా 7 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు పనిచేసి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్దికమంత్రిగా అరుదయిన రికార్డు రోశయ్య సొంతం చేసుకొన్నారు. అమీర్‌పేట్‌లోని నివాసానికి రోశయ్య భౌతికకాయం తరలించారు. తదుపరి గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం తరలించి రేపు ఆదివారం మధ్యాహ్నం 12.30కి మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
