సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో పండుగల వేళ సొంత ఊర్లకు సొంత వాహనాలలో వెళ్లాలనుకునే వారిని టోల్ ట్యాక్స్‌లు భయపెడుతుంటాయి. అయితే తాజాగా కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే విజయవాడ- హైదరాబాద్‌ 65 జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రకటన ఊరట కలిగించింది. వాహనాలకు టోల్‌ ట్యాక్స్ తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏ) నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ ట్యాక్స్ ఏప్రిల్ 1, మంగళవారం తెల్లవారుజాము నుంచి అమలులోకి రానున్నాయి. హైదరాబాద్‌-విజయవాడ మార్గానికి సంబంధించి తెలంగాణలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ సమీపంలోని చిల్లకల్లు టోల్‌ప్లాజాల ద్వారా ప్రస్తుతం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. వీటిల్లో అత్యధికంగా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30, తేలికపాటి ట్రాన్స్‌పోర్టు వాహనాలకు అయితే ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్‌ రుసుములో 25 శాతం మినహాయింపు లభిస్తుందని ఎన్‌హెచ్ఏ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *