సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాలలో గత 2వారాలుగా భానుడి ప్రచండం , ఉక్కపోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో ఇక నేటి మంగళవారం నుంచి వారం రోజుల పాటు కాస్త ఉపశమనం లభించనుంది. రేపు బుధవారం నుండి వచ్చే మూడ్రోజుల పాటు ఏపీలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లో సగటున 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించకపోవచ్చని వివరించింది. ఇప్పటికే నేటి మంగళవారం నుండి తెలంగాణాలో , ఖమ్మం , నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్లో నేటి మంగళవారం తెల్లవారుజాము నుంచే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇక వాతావరణం అయితే ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగరవాసులకు ఎండల తాకిడి నుంచి ఉపశమనం పొందారు.
