సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం విశాఖపట్నంలోని హోటల్ రాక్డేల్ లో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్. పరశురామరాజు అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ పై మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. ప్రముఖ తెలుగు కవి రాసిన దేశమంటే మట్టి కాదోయ్ .. దేశమంటే మనుషులోయ్ అంటూ ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలుగువారికి గర్వకారణం అని బడ్జెట్లో అన్ని రకాలుగా సమతుల్యత పాటిస్తూ రైతులు మహిళలు, యువకులు, మధ్యతరగతి, ఉద్యోగులకు అభ్యున్నతికి భారీగా కేటాయింపులు చేశారన్నారు. మోడీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో 12 లక్షల ఆదాయం వచ్చే వారికి సైతం పన్ను నుండి మినహాయింపు ఇవ్వటం జరిగింది అన్నారు. దేశవ్యాప్తంగా 18 ఎయిమ్స్ ఆసుపత్రులు నెలకొల్పితే ఒకటి ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చారు అని, రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది అని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్ర ప్రదేశ్ కు పెద్ద ఎత్తున కేంద్రం కేటాయింపులు ఇచ్చారని, అమరావతికి కొత్త రైలు మార్గానికి 2500 కోట్లు మంజూరు చేయగా విశాఖ రైల్వే డివిజన్ కార్యాలయంకి అనుమతులు ఇచ్చిందన్నారు. త్వరలో విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం వేగవంతంగా పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర పథకాలు రాష్ట్రంలో నత్తనడకన సాగయని,రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పూర్తి కాలేదు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,440 కోట్లు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే, బిజెపి శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ మాధవ్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
