సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు శరత్ బాబు (72).. నేడు సోమవారం హైదరాబాద్ లోని ప్రవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏఐజీ ఆస్పత్రిలో చాలారోజులుగా డాక్టర్లు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వస్తున్నారు. శరీరంలో ఇన్ఫెక్షన్ పెరగడంతో కీలక అవయవాలైన ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి మల్టీపుల్ ఆర్గాన్స్ పాడైనట్లు వైద్యులు గమనించారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఆయన మరణ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు శరత్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తూన్నారు. తెలుగు తో పాటు దక్షిణాది అన్ని బాషలలో ప్రముఖ నటుడిగా అందగాడుగా ఖ్యాతి గాంచి, హీరోగా, విలన్ గా కూడా పలు చిత్రాలలో నటించిన శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. శరత్ బాబు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని, ఆముదాలవలస. అతనికి తొమ్మిది మంది అన్నదమ్ములు. శరత్ బాబుకి అగ్ర నటులు అయిన శివాజీ గణేశన్ , కమల్ హాసన్, రజనీకాంత్ , చిరంజీవి ,నాగార్జునలతో ప్రత్యేక అనుబంధం ఉంది. తనకన్నా కొన్ని సంవత్సరాలు పెద్దది అయిన నటి రమాప్రభతో కొన్నేళ్లు కాపురం చేశారు. ఆ తర్వాత తమిళ నాడులో ప్రముఖ నటుడైన నంబియార్ కూతురు స్నేహలతని 1990లో వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ 20 ఏళ్ళు కాపురం చేశాక, 2011 సంవత్సరంలో విడిపోయారు. 300కి పైగా సినిమాలలో నటించిన శరత్ బాబు.. అయ్యప్ప స్వామి మహత్యం లో అపూర్వమైన విజయం అందుకొన్నారు.ఇక మరో చరిత్ర, ‘ఇది కథకాదు’, ‘తాయరమ్మ బంగారయ్య’, ‘మూడు మూళ్ళ బంధం’, శరణం అయ్యప్ప, సీతాకోక చిలుక, అభినందన, సాగర సంగమం, సితార, అన్వేషణ, స్వాతి ముత్యం, సంసారం ఒక చదరంగం, కోకిల, స్వాతి,అపద్భాందవుడు, అన్నయ్య, క్రిమినల్, ముత్తు , ముద్దాయి, దొంగాట తదితర చిత్రాల్లో నటించారు. చివరిగా పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో కన్పించగా, తాజాగా నరేష్ పవిత్రా లొకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అంతరంగాలు ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు శరత్‌బాబు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా శరత్‌బాబు మూడు నంది అవార్డులను అందుకున్నారు.
