సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంలోని సరిహద్దు దేశాల నుండి అక్రమంగా వచ్చిన చొరబాటుదారులందర్నీ తమ ప్రభుత్వం వెనక్కి పంపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హెచ్చరించారు.. రాష్ట్రీయ జనతా దళ్ (RJD), కాంగ్రెస్ (Congress) పార్టీలు రెండూ బిహార్ ఐడెంటిటీని ప్రమాదంలో పడేస్తున్నాయని విమర్శించారు. ఆర్జేడీ-కాంగ్రెస్ హయాంలో బిహార్ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందుల పాలయ్యారని అన్నారు. పూర్ణియాలో నేడు, సోమవారం నాడు పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిహార్ లో తమ కూటమి అభివృద్ధిని చూసి కాంగ్రెస్, ఆర్జేడీ ఓర్వలేకున్నాయని, అందువల్లే అనవసరమైన అంశాలను లేవనెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు. అయితే బిహార్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గట్టి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సొంత కుటుంబాల గురించి మాత్రమే ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తారని, తాము మాత్రం ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’నే విశ్వసిస్తామని మోదీ చెప్పారు.
