సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యూఢిల్లీ: 2047 నాటికి ‘వికాసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా కేంద్ర ఆర్థిక మంత్రి ‘నిర్మల సీతారామన్’ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కొనియాడారు. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి వృద్ధికి ఈ బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన నివాసంలో రాజమండ్రి ఎంపీ, మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, భీమవరంకు చెందిన రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ తో కలసి విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కేంద్ర బడ్జెట్ వల్ల కలిగిన ప్రయోజనాల పైన మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత ఆర్థిక లోటును 4.4% నుండి 4.3%కి తగ్గించి దేశాన్ని పటిష్ట స్థితిలో నిలబెట్టారని, మౌలిక సదుపాయాల కల్పన కోసం ₹12.2 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కేటాయించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానున్న VB-G RAM G పథకానికి ₹95 వేల కోట్లు, ప్రస్తుత ఎన్ఆర్జిఎస్ పనుల కోసం ₹30 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు ప్రకటించిందని రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తికి భారీ నిధులు కేటాయింపులు చేశారన్నారు.
