సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయత్ రాజ్ మంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. గత మంగళవారం మీడియా వేదికగా ఏపీ రాష్ట్రానికి రూ. కోటి విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఈ రోజు (బుధవారం) తెలంగాణ సీఎం సహాయనిధికి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా.. ప్రస్తుతం ఆయన పంచాయత్ రాజ్ మంత్రిగా ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు (రూ. 4 కోట్లు) ఒక్కో పంచాయితీకి రూ. 1 లక్ష చొప్పున విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు.మొత్తంగా, పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు వరదబాధితుల కోసం వ్యక్తిగతంగా రూ. 6 కోట్ల మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. పవన్ కల్యాణ్ నేడు, బుధవారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో చేపట్టిన చర్యలు మంచివేనని అన్నారు. బుడమేరు వాగును శాటిలైట్ ద్వారా పరిశీలించి.. అవసరమైన చర్యలు చేపట్టాలని నదుల వద్ద, వాగుల వద్ద అక్రమ నిర్మాణాలు తొలగించాలని అభిప్రాయపడ్డారు. అందుకు హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. అయితే ఇదే అన్నింటికి పరిష్కారం కాదన్నారు. అదే సమయంలో పేదలను సైతం దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలను మునిగే ప్రదేశాలను కేటాయించిందని ఆరోపించారు. ప్రస్తుతం వరదల వల్ల ఆయా ప్రాంతాలు పూర్తిగా మునిగి పోయాయన్నారు.నదులు, కాలువలను ఆక్రమించి ప్రముఖులు నిర్మాణాలు చేపడితే గత ప్రభుత్వం ఏం చేస్తుందని పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
